రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. పెను ముప్పు తప్పదు. కళ్లు మూసి తెరిచిలోపు.. ప్రాణాలే పోవచ్చు. అందుకే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు.. వాహనాలు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవ్వరికి ఏం కాలేదు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. జరిగిన సంఘటనతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే అంటే..
ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కారు ప్రమాదానికి గురయ్యింది. సోమవారం అర్థర్రాతి ఎలిజా.. తన కుటుంబ సభ్యులతో కలిసి.. హైదరాబాద్ నుంచి.. ఆయన సొంత ఊరు.. జంగారెడ్డిగూడెంకు కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద అనుకోని ఘటన చోటు చేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్ ఒక్కనిమిషం నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపు తప్పి.. రోడ్జు పక్కకు వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనతో కారులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాకపోతే.. వారి అదృష్టం బాగుండి ఈఘటనలో ఎవరికి ఏం కాలేదు.
ఇక ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టగానే.. అందులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. దాంతో ఎమ్మెల్యే ఎలిజాతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేసి మరో కార్ తెప్పించారు. దీంతో వారంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.