ఇటీవల కాలంలో దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కరు చేసే తప్పుకు ఎంతో మంది జీవితాలు బలి అవుతున్నాయి.. కుటుంబ పెద్దలను కోల్పోయి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.. వేల మంది వికలాంగులుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టేందుకు అధికారులు ఎన్నో కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నాయి. తాజాగా అనకాపల్లిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న షాపుల్లోకి దూసుకు వెళ్లింది.. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్.. అనకాపల్లిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఒక్కసారిగా అదుపుతప్పి షాపులో కి దూసుకు వెళ్లింది.. దీంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం అనకాపల్లి డిపో కి చెందిన ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి వస్తుండగా తుమ్మలపాడు వద్ద అనుకోకుండా స్టీరింగ్ పట్టి వేయడంతో రహదారి పక్కనే ఉన్న షాపుల్లోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. లోపన ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.. కిటికీ పక్కన ఉన్న వారికి గాయాలు అయ్యాయి. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ప్రయాణించకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు స్థానికులు. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న మూడు దుకాణాల్లోకి దూసుకు వెళ్లడంతో షాపులు ధ్వంసం అయి నష్టం జరిగిందని షాపు యజమానులు లబోదిబో అంటున్నారు. అదృష్టం కొద్ది ఆ సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్సై తెలిపారు.