మన సమాజంలో పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. అవును మరి నేరస్తుల ఆట కట్టించడమే కాక.. సమాజంలో నేరాలు చోటు చేసుకోకుండా చూసే బాధ్యత వారి మీద ఉంటుంది. చాలా మంది దృష్టిలో రియల్ హీరో అంటే పోలీసే. ఇక ఒకప్పుడు అమ్మాయిలు పోలీసులు ఉద్యోగం చేయాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా మంది యువతులు పోలీసు కొలువుల్లో చేరుతున్నారు. అయితే ఎక్కడైనా గ్రామంలో కొందరు.. లేదంటే ఇంటికి ఒకరో పోలీసు ఉద్యోగంలో చేరిన వారు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే గ్రామం కథ అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే.. ఈ ఊరిలో చిన్నా, పెద్ద, ముసలి ముతక.. ఆఖరికి పిల్లలు కూడా పోలీసులే. కాకపోతే.. ఎవరు యూనిఫాం వేసుకోరు. అదేంటి.. పోలీసులంటున్నారు.. ఖాకీ డ్రెస్ వేయరు అంటున్నారు.. ఇదేం ట్విస్ట్ అంటే.. ఇది చదవాలి.
కొవ్వాడ మత్స్యలేశం.. ఈ పేరు వింటే అణువిద్యుత్ పార్కు నిర్మాణం అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు రాక మునుపు కూడా ఈ ఊరు ‘పేరు’తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ పంచాయతీలో ప్రతి ఇంట్లో ఇద్దరు… ముగ్గురు ‘పోలీసు’లే ఉన్నారు. అమ్మ, నాన్న, పిల్లలు అందరూ పోలీసులే. తరాలు మారినా ఈ అలవాటు మాత్రం పోలేదు. ఈ పంచాయతీ జనాభా 5వేలు పైచిలుకు. ఓటర్లు 3100 వరకు ఉంటారు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులే నివసిస్తుంటారు. చేపల వేట వీరి జీవనాధారం. గ్రామ దేవత పోలేరమ్మ వీళ్ల గ్రామానికి రక్షణ. ఆమె కరుణాకటాక్షం నిత్యం ఉండాలని ఆ తల్లి పేరునే గ్రామస్తులు పెట్టుకుంటారు.
ఇది కూడా చదవండి: YS Sharmila: నిన్ను చూసి గర్విస్తున్నాను చిన్నా!.. కొడుకుపై షర్మిల పోస్ట్ వైరల్!
పోలేరమ్మే రక్ష..
కొవ్వాడ గ్రామస్తులు వందల ఏళ్ల నుంచి పోలేరమ్మను కొలుస్తున్నారు. ఏటా ఏప్రిల్ మాసంలో గ్రామ దేవత పండుగ ఘనంగా జరుపుతుంటారు. వీరంతా మత్స్యకారులు కావడంతో సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఎలాంటి ఆపద రాకూడదని అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు. కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని ఆ తల్లికే మొక్కుతుంటారు. దీంతో అమ్మవారి పేరు కలిసి వచ్చేలా పుట్టే పిల్లలకు ‘పోలీసు’ అని పేరు పెట్టడం కొన్ని తరాల ముందు మొదలైంది. ఇలా పేరు పెట్టుకుంటే ఎలాంటి చెడు జరగదని వీరి నమ్మకం. ఈ పద్ధతి ఇప్పటి తరం వరకు కూడా కొనసాగుతోంది. ఈ గ్రామంలో నివసించే సగం మందికి పైగా పేర్లు పోలీసులే. అమ్మ పేరు పోలీసమ్మ, నాన్న పేరు పోలీసు, కొడుకు పేరూ పోలీసు అనే చాలా మందికి ఉంటుంది. ఇటీవల పిల్లల పేర్లు సరికొత్తగా పెట్టుకుంటున్నా.. మొదటి ఊయలలో వేసేటప్పుడు పేరు మాత్రం పోలీసు, పోలీసమ్మే.
ఇది కూడా చదవండి: Gold Mines: మరో KGFలా నెల్లూరు! ఏకంగా 2000 హెక్టార్లలో బంగారు గనులు!
మరి ఎలా పిలుస్తారు..
ఊరంతా పోలీసులే అయితే అందరినీ ఎలా పిలుస్తారనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఇంటి పేరునో, మనిషి తీరునో బట్టి పొట్టి, పొడుగు, సన్నం, లావు వంటి ప్రత్యేక గుర్తులతో పిలుస్తుంటారు. గ్రామంలోకి కొత్తగా వెళ్లిన అధికారులకు ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఓటరు జాబితా తయారులోనూ చిక్కులు తప్పవు. ఇతర ప్రాంతాలైన గుజరాత్, వీరావళి, చెన్నై, బెంగళూరులకు వలసలు వెళ్లినప్పుడు వీళ్ల పేరు పోలీసుగా ఉండటంతో ఆక్కడ పోలీసులు, స్థానికులతో తీవ్ర చిక్కులు వచ్చేవని చెబుతుంటారు. అణు విద్యుత్ పరిహారం చెల్లింపులోనూ వీరి పేర్లతో తంటాలు తప్పలేదు. మరి ఊరంతా పోలీసు పేర్లే ఉన్న ఈ ప్రత్యేక గ్రామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: CM YS Jagan: CM జగన్ ముందు ఇంగ్లీష్ లో మాట్లాడి అదరగొట్టిన గవర్నమెంట్ స్కూల్ పాప! వీడియో వైరల్!