ఉన్న ఊరిలో ఉపాధి లేక.. వ్యవసాయ కలిసిరాక.. అప్పులపాలై.. వాటిని తీర్చే మార్గం లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఉన్న వారిని, కన్నవారిని వదిలి ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్న వారు ఎందరో. ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. దేశం కానీ దేశంలో.. భాష కూడా తెలియని ప్రాంతంలో వారిని బతికించేది సొంతవారి జ్ఞాపకాలే. అలా అయిన వారందరిని వదిలి ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి.. ఉరి కంబం ఎక్కబోతున్నాడంటే.. అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఊహించలేం. ఇదే వ్యధ అనుభవిస్తున్నారు కడప జిల్లాకు చెందిన ఓ కుంటుంబం. మరి వారికి వచ్చిన కష్టం ఏంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే
కువైట్ సిటీలో ఓ షేక్ కుటుంబం దారుణ హ్యత్యకు గురికాగా, ఆ కేసులో నిందితుడు కడప వాసిగా తేలినట్లు వార్తలొస్తున్నాయి. సొంత యజమాని ఇంట్లో చోరీకి యత్నించి, అడ్డొచ్చిన ముగ్గురినీ హతమార్చినదుకు గాను నిందితుడికి మరణశిక్ష విధించినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంపై కువైట్ ప్రభుత్వం నుంచిగానీ, అక్కడి ఇండియన్ ఎంబసీ నుంచిగానీ స్పష్టమైన ప్రకటనలు లేకున్నప్పటికీ, కడపలో నివసిస్తున్న సంబంధిత కుటుంబికుల ద్వారా విషయాలు బయటికొస్తున్నాయి.
ఇది కూడా చదవండి: గదిలో బాయ్‌ఫ్రెండ్.. బాత్రూంలో బ్యూటిషియన్ శవం.. ఇంతకీ ఏమైంది?..
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేశ్ బతుకుదెరువు కోసం మూడేళ్ల కిందట కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో డ్రైవర్ గా పనిలో చేరాడు. రెండేళ్ల తర్వాత వెంకటేశ్ తన భార్య స్వాతిని కూడా కువైట్ తీసుకెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు మాత్రం దిన్నెపాడులో తాత(శ్రీరాములు) దగ్గర ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటేశ్ పనిచేస్తున్న ఇంటి యజమాని, అతడి భార్య, కుమార్తె ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఉదంతానికి సంబంధించి శ్రీరాములు స్థానిక మీడియాకు కీలక విషయాలు చెప్పారు.
ఇది కూడా చదవండి: పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
వారం రోజుల కిందట ఒక వ్యక్తి(కువైట్) నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్యాకూతుళ్లను కత్తితో గొంతు కోసి చంపిన నేరం కింద కొడుకు(వెంకటేశ్)ను పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిపాడన్నారు శ్రీరాములు. యజమాని కుటుంబాన్ని హతమార్చాడనే కారణంగా అక్కడి నేర శిక్షాస్మృతి ప్రకారం తన కుమారుడుకి ఉరిశిక్ష పడుతుందని సదరు వ్యక్తి ఫోన్లో తెలిపారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారం కిందటే వెంకటేశ్ ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకున్నాడని, కానీ ఇంతలోకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని, ఎంబసీని సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.