ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రేషన్‌కార్డు మీద బియ్యం బదులు చిరు ధాన్యాల పంపిణీకి రెడీ అవుతుండగా.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు ఉన్నవారికి జగన్ సర్కార్ ఒకేసారి రెండు గుడ్ న్యూస్‌లు చెప్పేందుకు రెడీ అయ్యింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడమే కాక.. అమలుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇంతకు ఆ రెండు శుభవార్తలు ఏవంటే.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించే దిశగా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఇప్పటికే రేషన్‌కార్డుదారులకు ఇచ్చే బియ్యం బదులు.. వాటి స్థానంలో రాగులు, జొన్నలు పంపిణీ చేసేందుకు సర్కార్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనితో పాటు.. రేషన్‌కార్డుదారులకు ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ నుంచి రేషన్‌కార్డుదారులకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నిచ్చేలా ప్రణాళికులు రెడీ చేశామని.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 22రానున్నరెండు నెలల్లో రాష్ట్రంలో రేషన్‌కార్డుదారులకు పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి అవసరమైన రాగులు, జొన్నల సరఫరాకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అంగీకరించారు. అలానే ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తాం’’ అన్నారు. అంతేకాక ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు రెండు కిలోల గోధుమ పిండిని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉత్తరాంధ్రలోని మున్సిపాలిటీల్లో అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అలానే ఈ నెల 4 నుంచి తణుకు నియోజకవర్గంలోనూ గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని.. అలాగే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా గోధుమ పిండి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులకు కోసం లక్ష అంత్యోదయ రేషన్‌కార్డులను కోరామని.. దీనికి కేంద్రమంత్రి గోయల్ అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి రేషన్ కార్డును తొలగించడం లేదని.. కేవలం అనర్హులవి మాత్రమే తొలగిస్తున్నట్లు ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు నాగేశ్వరరావు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.