5జీ ట్రయల్స్‌ – టెక్నాలజీ ప్రియులకు శుభవార్త!

5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్‌).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్‌, హైదరాబాద్‌ నగరాల్లో ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో 700 మెగా హెడ్జ్‌ బ్యాండ్‌, 3.3-3.6 గిగాహెడ్జ్‌ బ్యాండ్‌, 24.25-28.5 గిగాహెడ్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయించినట్టు వారు చెప్పారు.

5g

చైనా కంపెనీల టెక్నాలజీ ఉపయోగించకుండా ఎరిక్సన్‌, నోకియా, సామ్‌సంగ్‌, సీ-డాట్‌ టెక్నాలజీలతో 5 జీ ట్రయల్స్‌ నిర్వహణకు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌లకు మే 4న డాట్‌ అనుమతి ఇచ్చింది. దీనికి తోడు రిలయన్స్‌ జియో తమ ప్రత్యేక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ప్రాథమికంగా 6 నెలల పాటు ఈ ట్రయల్స్‌ జరుగుతాయి. ఆపరేటర్లు ట్రయల్స్‌ను గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఏ ఒక్క టెలికాం ఆపరేటర్‌కు పంజాబ్‌, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లలో ట్రయల్స్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయించలేదు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే పూర్తి: ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రయోగాత్మక ట్రయల్స్‌ను పూర్తి చేసింది. అందుబాటులో ఉన్న 1800 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా ఇవి నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, స్పెక్ట్రమ్‌ లభిస్తే వెంటనే దేశవ్యాప్తంగా 5జీ టెలికాం సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌ నుంచి ప్రయోగాత్మక 5జీ ట్రయల్స్‌ నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. రిలయన్స్‌ జియో కూడా ఇందుకు సిద్ధమవుతోంది.