ఇషాన్ కిషన్ ఈ సీజన్‌లో బాగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన సందర్భాలను ప్రస్తావిస్తే ఇప్పుడు మాత్రం మెరుపు ఇన్నింగ్సుల గురించే చెప్పుకుంటున్నారు. ఒత్తిడిని అధిగమించడం.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని బ్యాటింగ్ చేసిన కిషన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శుక్రవారం హైదరాబాద్‌పై ఇషాన్ కిషన్ ఆట తీరు అందరినీ మంత్రముగ్దులను చేసింది. అతను ఆడే ప్రతిషాట్ బౌండరీకి చేరుతుంటే ప్రేక్షకులే కాదు.. క్రికెట్ పండితులు కూడా ఔరా అన్నారు. టీ20 ప్రపంచకప్ ముంగిట ఇషాన్ కిషన్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం టీమిండియాకి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.
టీమిండియా జట్టులో చోటు దక్కిన ఇషాన్ కిషన్ మొదట్లో చేసిన ప్రదర్శన అందరినీ ఆందోళనకు గురిచేసింది. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా కొద్దిరోజులే ఉన్నాయి. ప్రాక్టీసు చేసే సమయం కూడా లేదు మరి ఇలాంటి ప్రదర్శన ఏంటని అభిమానులు అంతా భయపడ్డారు. ఒకరోజు ఆర్సీబీతో మ్యాచ్ అయ్యాక కోహ్లీ ఇషాన్‌ను పిలిచి వ్యక్తిగతంగా అతడు చేస్తున్న తప్పులపై క్లారిటీ ఇచ్చాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ఆ సమయంలో కోహ్లీ ఏం చెప్పాడు అన్నది అందరికీ క్లియర్‌గా తెలీదా గానీ, అప్పటి నుంచి ఇషాన్‌కు ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. అద్భుత ప్రదర్శనతో రెచ్చిపోయాడు. హైదరాబాద్ మీద జరిగిన మ్యాచ్‌లో అయితే 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు కోహ్లీ తనకు చెప్పిన మాటలు ఎంతగానో ఫలితాన్నిచ్చాయన్నాడు. ‘కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. జట్టు సభ్యులంతా తనను వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో కోహ్లీ భాయ్‌తో మాట్లాడటం నాకు చాలా మంచి చేసింది. మేజర్ టోర్నీలో నువ్వు ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యావ్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు’ అని కోహ్లీ భాయ్ నాతో చెప్పాడంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఇషాన్ ఓపెనర్‌గా రావడం టీమిండియాకి మంచి చేసే అంశమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.