‘ఐపీఎల్ 2021’ దాదాపుగా చివరి అంఖానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఢీల్లీ, చైన్నై, బెంగళూరు, కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈసారి ముంబయి ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేక పోయింది. కరోనా కారణంగా ఈ సీజన్‌ను రెండు భాగాలుగా రెండు దేశాల్లో నిర్విహిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ మొదలైనప్పటి నుంచి జట్టులో ఆటగాళ్ల విషయంలో కూడా చాలా వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఎంతో మంది విదేశీ ఆటాగళ్లు తిరిగి వెళ్లిపోయారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్ తమ ఆటగాళ్లను పిలిపించిన విషయం తెలిసిందే. కరోనా పుణ్యమా అని ఈ సీజన్ మొత్తం ఎన్నో మార్పులు చేర్పులతో ఐపీఎల్ సాగుతోంది. అయినా ప్రతి టీమ్ తమ అత్యుత్తమ ప్రదర్శనను చేస్తోంది. ప్రతి జట్టు నుంచి లీగ్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన.. కీ ప్లేయర్ ఫర్ దెయిర్ టీమ్ ఎవరు అని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఈ రైటార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఈ సీజన్‌లో ఎంతో నిలకడగా బౌలింగ్ చేశాడు. లీగ్ మ్యాచుల్లో 14 ఇన్నింగ్స్ లో 7.18 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ టేకర్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎందరో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎంతో నిలకడగా బ్యాటింగ్ చేసిన గైక్వాడ్.. ఈ సీజన్ లో సెంచరీ కూడా నమోదు చేశాడు. 14 మ్యాచుల్లో 44.41 బ్యాటింగ్ సగటుతో 533 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై తరఫున కీ ప్లేయర్ అనడంలో ఎలాంటి సదేహం లేదు.
ఈ సీజన్ మొత్తం అభిమానులను ఆకట్టుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే కాదు.. ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంది. ఆర్సీబీ ఈ స్థితికి చేరడంలో బౌ లర్ హర్షల్ పటేల్ పాత్ర ఎంతో ఉంది. ఈ టీమ్ కు ఇప్పటివరకు స్లాగ్ ఓవర్ లో స్కోరును కాపాడుకోలేదు అనే నింద ఉండేది. కానీ, హర్షల్ పటేల్ ఆ నిందను తొలగించాడు. ఈ సీజన్‌లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.
ఐపీఎల్ సెకండాఫ్ లో వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శన అందరీని ఆకట్టుకుంది. టీమిండియాకి జూనియర్ గంగూలీ దొరికేశాడు అనడం అతిశయోక్తి కాదు. అతను ఎన్ని పరుగులు చేశాడు అనే విషయం కన్నా కోల్‌కతాకు ఓపెనర్ గా అతను ఎంత మంచి స్టార్ట్ ఇచ్చాడు అన్నదే ముఖ్యం. 7 ఇన్నింగ్స్ లో 249 పరుగులు చేసిన అయ్యర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.
ముంబయి అందుకునే విజయాల్లో బ్యాటింగ్ కన్నా బౌలర్ జాస్ప్రిత్ బుమ్రా పాత్రే ఎక్కువ ఉంటుంది అని మనమే కాదు.. ఆ జట్టు ఆటగాళ్లే చెప్తారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని పేరున్న బుమ్రా ఈ సీజన్ లోనూ ముంబయికి కీల ప్లేయర్ అనడంలో సందేహం లేదు. 14 ఇన్నింగ్స్‌లో 21 వికెట్లు తీసిన బుమ్రా అత్యధిక వికెట్ టేకర్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయినా కూడా.. వారి ఫైట్ మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ స్కోరు చేయడం.. భారీ లక్ష్య చేధనలో వారి పోరాట పటిమ అందరినీ అలరించింది. టీమ్‌లో కీ ప్లేయర్ అంటే జైస్వాల్ అనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అతడు ఆడే షాట్స్ అందరినీ మెస్మరైజ్ చేశాయి.
పంజాబ్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ తన పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తించాడు. కెప్టెన్ గా ముందుండి జట్టును నడిపించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులతో ఆరంజ్ క్యాప్ హోల్డర్(626 పరుగులు)గా ఉన్నాడు రాహుల్. అతను ఫామ్‌లో ఉండటం టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకి ఎంతో మేలు చేస్తుంది.
వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎప్పటికీ హైదరాబాద్ టీమ్ కు కీ ప్లేయర్ జాబితాలో ఉంటాడు. అతని స్పిన్ తో ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెడతాడు. ఈ సీజన్‌లోనూ 14 ఇన్నింగ్స్ లో 18 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ హైదరాబాద్ చేసిన ప్రదర్శనలో తన వంతు కృషి చేశాడు.
ఐపీఎల్ 2021 ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.