ఐపీఎల్ 2021- ప్లేఆఫ్ బెర్త్ కోల్ కతా నైట్ రైడర్స్ దే, రాజస్థాన్ పై భారీ విజయం

స్పోర్ట్స్ డెస్క్- కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగో ప్లేఆఫ్స్ బెర్తుని ఇంచుమించు కన్ఫమ్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. షార్జా వేదికగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్ బెర్తుల్ని ఖరారు చేసుకోగా, ఇక ఇప్పుడు మిగిలిన నాలుగో బెర్తుని కోల్‌కతా నైట్ రైడర్స్ భర్తీ చేయడం లాంఛనం మాత్రమే అని చెప్పవచ్చు.

షార్జాలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్, ఓపెనర్లు శుభమన్ గిల్ (56: 44 బంతుల్లో 4×4, 2×6), వెంకటేశ్ అయ్యర్ (38: 35 బంతుల్లో 3×4, 2×6) మంచి ఫాంలో ఆడటంతో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరీస్ తలో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆట పేలవంగా సాగింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (0), లివింగ్ స్టోన్ (6)తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ (1), అనుజ్ రావత్ (0), గ్లెన్ ఫిలిప్స్ (8) సింగిల్ డిజిట్‌కే వరుసగా వెనుతిరిగారు.

Shivam

ఈ దశలో శివమ్ దూబె (18: 20 బంతుల్లో 1×6)తో కలిసి రాహుల్ తెవాటియా (44: 36 బంతుల్లో 5×4, 2×6) కాసేపు బాగానే ఆడినా ప్రయోజనం లేకుండాపోయింది. రాజస్థాన్ రాయల్స్ స్కోరు 34 వద్ద దూబె ఔటవగా, ఆ తర్వాత వచ్చిన క్రిస్ మోరీస్ (0), జయదేవ్ ఉనద్కత్ (6), చేతన్ సకారియా (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన రాహుల్ తెవాటియా, టీమ్ స్కోరు 85 వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లు తీయగా, ఫెర్గూసన్ మూడు, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ తీశారు.

ప్లేఆఫ్స్ బోర్డ్ లో ఆరు విజయాలతో ముంబయి ఇండియన్స్ ఆరో స్థానంలో ఉండగా, ఆ జట్టు శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడబోతోంది. ఆ మ్యాచ్‌లో ఒకవేల ముంబయి 170కి పైగా పరుగుల తేడాతో గెలిస్తే, ఆ జట్టుకి ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుంది. అనుకోని పరిస్థితుల్లో సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం ముంబయికి ఆ అవకాశం దక్కకపోవచ్చు. రెండు జట్ల మధ్య నెట్ రన్‌ రేట్ తేడా భారీగా ఉండటమే ఇందుకు కారణం.