టీమిండియాలో కరోనా.. ఆఖరి టెస్టు సంగతి అంతేనా?

ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా జట్టులో కరోనా కలకలం రేపింది. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రికి కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌, ఫిజియోథెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌కు కరోనా లక్షణాలు ఉన్నాయి. వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టు నిర్వహించారు. వారి టెస్టుల ఫలితాలు రాలేదు.. అప్పటివరకు వారిని జట్టుకు దూరంగా ఉంచారు. ప్రధాన ఆటగాళ్లకు ఎలాగూ నెగిటివ్‌ రావడంతో నాలుగో టెస్టుకు ఆటకం రాలేదు.

లండన్‌ హోటల్‌లో తన పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రికి కరోనా వచ్చింది. ఆ హోటల్‌లోకి మామూలు అతిథులను కూడా అనుమతించారు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయి. నాలుగో టెస్టులో టీమిండియాకి గెలిచే అవకాశాలు లేకపోలేదు. నాలుగో టెస్టు గెలిస్తే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉంటాం. అదే ఓడినా.. మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. ఐదో టెస్టు చాలా కీలకం అవుతుంది. మరి హెడ్‌ కోచ్‌, బౌలింగ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ లేకుండా టీమిండియా ఎలా ఆడుతుంది. ఐదో టెస్టు పరిస్థితి ఏంటన్నదే అందరి ప్రశ్న.

ravi shastriమంగళవారం టీమిండియా మాంచెస్టర్‌కు బయల్దేరాలి. రవిశాస్త్రి ఎలాగూ ఐసోలేషన్‌లో ఉన్నారు. బౌలింగ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌ ప్రస్తుతానికి ఐసోలేషన్‌లో ఉన్నారు. వారి రిసల్ట్‌ నెగిటివ్‌ వస్తే సరే.. వారికి కరోనా నిర్ధరణ జరిగితే వారు 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. నెగిటివ్‌ వచ్చాక మాత్రమే మిగిలిన సభ్యులతో కలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఐదో టెస్టులో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నదే అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికిప్పుడు వేరే వారిని ఏర్పాటు చేసే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. మరి, వారి టెస్టుల ఫలితాలపైనే టీమిండియా ఐదో టెస్టు ఫలితం ఆధారపడి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌ వేదికగా సెప్టెంబర్‌ 10 నుంచి భారత్‌, ఇంగ్లాడ్‌ మధ్య ఐదో టెస్టు జరగనుంది.