మోర్గాన్ పై గంభీర్ ఫైర్.. అలాంటి పరిస్థితి నాకొస్తే కెప్టెన్ గా తప్పుకునేవాడ్ని

gautam gambir

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోర్గాన్‌ పరిస్థితి నాకు వచ్చుంటే కెప్టెన్‌గా తప్పుకునే వాడిని అంటూ ఘాటుగా స్పందించాడు. విషయం ఏంటంటే ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డగౌట్‌లో ఉన్న కేకేఆర్‌ అనలిస్ట్‌ నాథన్‌ లీమన్‌ కోడ్‌ భాషలో మైదానంలో ఉన్న మోర్గాన్‌తో సంభాషిస్తున్న విషయం కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో అప్పటి నుంచి నెట్‌లో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న గంభీర్‌ను తోటి కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అడిగిన ప్రశ్నకు గంభీర్‌ ఘాటుగా స్పందించాడు. ‘సందర్భం ఏదైనా మైదానంలో ఉన్న ఆటగాళ్లతో చర్చించుకుని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. బయటివారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునే దౌర్భాగ్య స్థితిలో కేకేఆర్‌ కెప్టెన్‌ ఉన్నాడు. అలా చేయడం సరైంది కాదు’ అంటూ గంభీర్‌ చెప్పుకొచ్చాడు. అలాంటి పరిస్థితులకు తాను చేరితే కెప్టెన్‌గా తప్పుకునే వాడినన్నాడు.

నాథన్‌- మోర్గాన్‌కు ఇది కొత్తేం కాదు..

కేకేఆర్‌కు అనలిస్ట్‌గా వ్యవహరిస్తున్న నాథన్‌ లీమన్‌.. ఇంగ్లాండ్‌ జట్టుకు కూడా అతడే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. వాళ్లు ఇలా కోడ్‌ భాషలో మాట్లాడుకోవడం ఇది కొత్తేం కాదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లోనూ ఇలాగే మాట్లాడుకుంటూ కనిపించింది ఈ జోడీ. ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలు అప్పుడు బాగా వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం కేకేఆర్‌ మ్యాచ్‌లో సన్నివేశాలు, అప్పటి ఫొటోలను కలిపి ప్రస్తుతం నెటిజన్లు కౌంటర్లు, కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ 10 మ్యాచ్లలో నాలుగింటిలో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

నాథన్‌ లీమన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ కోడ్‌ భాషపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.