టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై గౌతం గంభీర్ మరోసారి విమర్శలు గుప్పించాడు. ధోనీని కొందరు కావాలనే హీరోను చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే.. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ సారథుల లిస్టులో ధోని కూడా ఉంటాడు. క్రికెట్లో ధోని పట్టిందల్లా బంగారమని అనొచ్చు. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. సారథిగా భారత జట్టుకు టీ20, వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు మాహీ. అలాగే టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్ ప్లేసుకు చేర్చాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించాడు. ఐపీఎల్ పదహారో సీజన్లోనూ సీఎస్కే కప్ గెలవడంలో సారథిగా ఎంతో కృషి చేశాడు ధోని. మాహీని ఎందరు మెచ్చుకున్నా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం అతడిపై అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉంటాడు. మరోసారి ధోనీపై అక్కసు వెళ్లగక్కాడు గౌతీ. అయితే ఈసారి అతడు చేసిన కామెంట్స్ కాస్త ఆలోచించదగ్గవనే చెప్పాలి.
ఇంతకీ గంభీర్ ఏమన్నాడంటే.. ‘ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం టీమ్ పెర్ఫార్మెన్స్కు ఇవ్వకపోవడమే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లు సమష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తాయి. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిందంటే అందుకు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రధాన కారణం. ఆ రెండు టోర్నీల్లోనూ యువీనే టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కానీ పీఆర్ ఏజెన్సీలు మాత్రం ధోనీని హీరోను చేసేశాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన నేపథ్యంలో.. ఐసీసీ టోర్నమెంట్లలో గెలవడం ధోనీకే సాధ్యం అన్నట్లు అందరూ అతడ్ని పొగుడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ పైవిధంగా స్పందించాడు. ధోని విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.