అయ్యర్‌పై కోచ్‌ ప్రశంసల జల్లు.. ఏకంగా ఆ లెజెండ్‌తో పోల్చాడు

venkateshayer meccullum kkr ipl2021

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ 2021 రెండో దశలో దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. కేకేఆర్‌ ఇలా గెలుపుబాట పట్టేందుకు ప్రధాన కారణం ఓపెనర్లు. అందులో మరీ ముఖ్యంగా జూనియర్‌ గంగూలీ వెంకటేష్‌ అయ్యర్‌. రెండు మ్యాచ్‌లలోనూ అద్భుతంగా ఆడాడు. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 27 బంతుల్లో 41 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో ఒక సిక్స్‌, 7 ఫోర్టు ఉన్నాయి. ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇలా రెండు మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

venkateshayer meccullum kkr ipl2021

ఎప్పటి నుంచే కేకేఆర్‌ను వేధిస్తున్న ఓపెనింగ్‌ జోడి సమస్యకు అయ్యర్‌ ఒక సమాధానంలా దొరికాడు. కాగా కొత్త సంచలనంపై కేకేఆర్‌ జట్టు ప్రధాన కోచ్‌ బ్రండెన్‌ మెకల్లమ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వెంకటేష్‌ అయ్యర్‌ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్‌ లాంటి విధ్వంసకర ఆటగాడని కితాబిచ్చాడు. అయ్యర్‌ మ్యాచ్‌ విన్నర్‌ అని కొనియాడాడు. నిజంగా అయ్యర్‌ ఆట తీరుతో కేకేఆర్‌ జట్టులో ఆత్మవిశ్వాసం టన్నుల కొద్ది వచ్చి చేరింది. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో తనకు మంచి అండర్‌స్టాండింగ్‌ ఉండడంతో ఇద్దరు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. అయ్యర్‌ ఆఫ్‌సైడ్‌ షాట్లు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. కేకేఆర్‌కు జూనియర్‌ దాదా దొరికాడని సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.