హైదరాబాద్ క్రైం- మన దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా నేరాలు, ఘోరాలు మాత్రం ఆగడం లేదు. అందులోను ఈ మధ్య కాలంలో ఆర్ధికపరమైన నేరాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ అమ్మాయి మోజులో పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మాధాపూర్ లో ఒంటరిగా అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఖాళీ సమయంలో లైఫ్ స్ట్రీమింగ్, స్ట్రీమ్ కరో యాప్‌లలో చాటింగ్ చేస్తుండగా ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వీడియో కాల్స్ చేసుకనే వరకు వెళ్లింది. ఇక ఇద్దరు కొన్ని రోజుల్లోనే చాలా దగ్గరయ్యారు.
తానూ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, ఇద్దరు పిల్లలున్నారని ఆమె చెప్పింది. తనను పెళ్లి కూడా చేసుకుంటానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు మాట ఇచ్చింది. అంతలోనే అనుకోని అవసరం వచ్చిందంటూ 5 లక్షల రూపాయలు కావాలని కోరింది. ఎలాగూ తనను పెళ్లిచేసుకోబోతోంది కదా అని వెంటనే ఆమె బ్యాంక్ అకౌంట్ కు 5 లక్షల రూపాయలు పంపించేశాడు. ఇంకేముంది ఆ తరువాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తాను మోసపోయానని, ఎవరికైనా చెబితే పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నాడు.
అంతలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అదే యాప్‌లో ఆ యువతి ముఠాకు చెందిన శ్రీధర్ సాగర్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మాటల సందర్బంలో యువతి ఇలా మోసం చేసిందని చెప్పడంతో, ఏంతెలియనట్టే డబ్బు పోయినందుకు సానుభూతి చూపించాడు. కాస్త ఫ్రెండ్ షిప్ పెరిగాక ఓ రోజు ఫాంహౌజ్ కు ఆహ్వానించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అక్కడికి వెళ్లాడు. ఇంకేముంది మూడు రోజులు అతనికి డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి దింపాడు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్రెడిట్ కార్డులు తీసుకొని పే పాల్ ద్వారా 15 లక్షల వరకు ఓ సెలబ్రిటీ యువతికి పంపించాడు. మెలకువ వచ్చి చూసే సరికి శ్రీధర్ సాగర్ పారిపోయాడు. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.