స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 స్థానాల్లో విజయ్ అభిమానుల గెలుపు

తమిళనాడు- ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. పోలింగ్ బూత్ లోకి వెళ్లాక ఎవరు ఎవరికి ఓటు వేస్తారో ఎవ్వరు ఊహించలేరు. కానీ ఒక్కోసారి ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని వారికి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. ఇందుకు తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రముఖ నటుడు విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వంద మందికిపైగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు.

సీనియర్ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిన టైంలో, విజయ్ అభిమాన సంఘం దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ ఏకంగా వంద స్థానాలను గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Actor Vijay 1

ఈ నెల 6న మొత్తం 39 యూనియన్లలో పోలింగ్ జరగ్గా, మిగిలిన 35 యూనియన్లలో 9న పోలింగ్ జరిగింది. 140 జిల్లా పంచాయతీ వార్డు సభ్యులు, 1,381 పంచాయతీ యూనియన్ వార్డు సభ్యులు, 2,901 గ్రామ పంచాయతీ అధ్యక్షులు, 22,581 గ్రామ పంచాయతీ వార్డు కౌన్సిలర్లు సహా మొత్తం 27,003 పోస్టుల కోసం ఎన్నికలు జరిగాయి. మరోవైపు 74 పంచాయతీ యూనియన్లకూ ఎన్నికలు జరిగాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నటుడు విజయ్ నుంచి మొదటిసారి దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ జెండాపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో విజయ్ ఫ్యాన్ క్లబ్ సభ్యుయలు విజయం సాధించారు. మొత్తం వంద స్థానాల్లో గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.