అల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ, నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై బీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఇలయ దళపతి విజయ్ తనను బెదిరిస్తున్నారంటూ తమిళనాడుకి చెందిన రాజేశ్వరి ప్రియ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘మాస్టర్’ తర్వాత విజయ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
లిరికల్ వీడియోలో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదాస్పదమైంది. అయితే కొందరు ఈ పాటలో మత్తు పదార్థాల వాడకంతో పాటు రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ విజయ్ అలాగే చిత్ర బృందం మీద నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. వారిలో అల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. ఆమె పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌ని టార్గెట్ చేసి తప్పు పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై బీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందామె.
విజయ్ సినిమాలో వచ్చిన స్మోకింగ్ వీడియోలపై నిరసనలు వ్యక్తం చేసినందుకే.. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందనే పదాలను టీం పాటలో పెట్టిందని, తను చేసిన ఈ పోరాటం వల్ల హీరో విజయ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో ఆయన ఐడీని ట్యాగ్ చేస్తూ.. అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారని చెప్పింది. అంతేకాదు, హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని ఆరోపించింది. ఓ మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానులను ప్రేరేపించిన విజయ్‌ని పోలీసులు అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. గతంలో రజినీ కాంత్ మీద కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేసింది రాజేశ్వరి ప్రియ.