ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీరికి మైనర్లు మరో పెద్ద సమస్యగా మారారు. లైసెన్సు లేకుండా.. మైనర్లు, విద్యార్థులు బైక్ లు, కార్లతో చక్కర్లు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కువ ప్రమాదాలు మైనర్ల వల్లే జరుగుతున్నట్లు గుర్తించారు. అసలు వీరికి వాహనాలు ఎలా వస్తున్నాయంటూ తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఓ సర్వే నిర్వహించారు. అందులో అసలు విషయాలు వెలుగు చూశాయి.
విద్యార్థులు, మైనర్లు వాహనాలను తల్లిదండ్రులు, ప్రైవేటు సంస్థలు, మొబైల్ యాప్ ల ద్వారా తీసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కొందరు విద్యార్థులు తల్లిదండ్రులను ఒత్తిడి చేసి ద్విచక్రవాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. క్రెడిట్ కార్డుతోనైనా వాహనం కొనియాల్సిందేనని పేరెంట్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు బండి కొనివ్వనిదే కాలేజ్ కు వెళ్లమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మరికొందరు మా ఫ్రెండ్స్ బైక్ లో కాలేజ్ కి వస్తే మేము బస్ కి ఎలా వెళ్తాం.. మన పరువేం కావాలంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పి బైక్ లు కొనిపించుకుంటున్నట్లు కూడా తెలుసుకున్నారు.
లైసెన్సు లేకుండా బైక్ లు, కార్లు నడుపుతున్న విద్యార్థులు, మైనర్లలో 30 శాతం మంది ఇంటర్మీడియట్ విద్యార్థులే ఉన్నట్లు గుర్తించారు. లైసెన్సులు కూడా లేకుండా రోడ్ పై షికార్లు కొట్టడం, రేసుల్లో కూడా పాల్గొంటున్నారంటూ కనుగొన్నారు. అలాంటి వారు తొలిసారి పోలీసులకు పట్టుబడితే మాత్రం మైనర్లతో పాటు తల్లిదండ్రులు కూడా జైలుకు పంపుతామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరువు, ఇజ్జత్ అంటూ పిల్లలకు బైక్ లు కొనిపెట్టి జైలుకు వెళ్లేందుకు రెడీ అవ్వకండి అంటూ కొందరు హితవు పలుకుతున్నారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.