రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీం

న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ కృష్ణ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక రఘురామ కృష్ణరాజుకు కేంద్రం కెటాయించిన వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని కూడా కోర్టు సూచించింది. ఆయనకు వైద్య పరీక్షల నిర్వహణ జరిగే సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Raghurama

ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 21కి వాయిదా పడింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామ కృష్ణరాజును సాయంత్రం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తీసుకురానున్నారు. మంగళవారం ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారని రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. అంతే కాకుండా తనకు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన కోర్టును కోరారు. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.