నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెలుగు లో ప్రముఖ ఛానల్ చైర్మన్ మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సంచలనం రేపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, సదరు చానల్ చైర్మన్ మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్టీ లోక్ సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖ ప్రతిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కు అందజేసింది.
ఎంపీ రఘురామ, ఛానల్ చైర్మన్ మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్ పై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు.
మనీ లాండరింగ్, ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు. దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ఫోన్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు రూ 11కోట్ల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చారు.
ఈ వ్యవహారంలో అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సీఐడీ రాసిన లేఖను సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ఎంపీ రఘురామకి సంబంధించి సీజైన మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపామని దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది.
రఘురామ, మీడియా అధిపతి మధ్య జరిగిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వివరించింది.
రఘురామకృష్ణరాజు, ఛానల్ చైర్మన్ లపై పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద కేసు నమోదుచేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి: