కేరళలో బయటపడిన రహస్య దీవి

కోచీ- దేవతలు నడయాడే ప్రాంతం కేరళ. అంతే కాదు ప్రకృతి అందాలకు నెలవు కూడా. అరేబియా సముద్రపు అలలు, పచ్చని ప్రకృతి సోయగాలతో మైమరపించే అందం కేరళ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కేరళలో ఒక్కసారైనా సందర్శించాలని ఉవ్విళూరుతుంటారు. అంతే కదా మరి కేరళ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు కేరళలో కొత్తగా బయటపడిన రహస్య దీవి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు లేని దీవి ఒక్కసారిగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

island

కేరళలోని కోచీకి పశ్చిమ తీరంలో ఉన్న ఈ దీవి గురించి ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఇటీవలే గూగుల్ మ్యాప్‌లో హాఠాత్తుగా ఈ రహస్య దీవి ప్రత్యక్షమైంది. చెల్లనం కర్షిక టూరిజం డిపార్ట్‌మెంట్ అధ్యక్షుడు జావియర్ జులప్పన్ కలిప్పరంబిల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఈ దీవి వెలుగులోకి వచ్చింది. దీంతో అంతా ఈదీవి గురించే చర్చించుకుంటున్నారు. ఈ దీవి సముద్రం అడుగున ఉంది. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ దీవి కోచి తీరానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ రహస్య దీవి పొడవు సుమారు ఎనిమిది కిలో మీటర్ల కాగా, వెడల్పు మూడు కిలోమీటర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రహస్య దీవి కొత్తగా ఏర్పడిందా లేక సముద్ర మట్టాలు పెరగడం వల్ల అప్పటికే ఉన్న దీవి కనుమరుగైందా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓసియన్ స్టడీస్ ఈ రహస్య దీవి గురించి తెలుసుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది.