మీరు పాత కారు, బైక్ నడుపుతున్నారా.. ఐతే ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్త

స్పెషల్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల కారణంగా గాలి కాలుష్యం అయిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు వాహనాల సంఖ్యను తగ్గించేంకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

భారత్ లో కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా పాత వాహనాలను సాధ్యమైనంత మేర నియంత్రించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనను అమలులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

Traffic 1 1

వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అమలులోకి వస్తుండటంతో పాత వెహికల్స్ కలిగిన వారిపై కొంత ప్రభావం పడబోతోంది. పాత వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి వాటి రెన్యూవల్ గురించి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ మేరకు 15 ఏళ్ల నాటి ట్రక్, బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ రెన్యూవల్‌కు 8 రెట్లు అధిక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 15 ఏళ్లు దాటిన భారీ వాహనాలకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న 1500 కాకుండా 12500 ఫీజు కట్టాలి.

ఇక 15 ఏళ్ల నాటి పాత కారు రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు సుమారు 5 వేల వరకు చెల్లించాలి. ప్రస్తుతం ఈ చార్జీ 600 మాత్రమే. అదే పాత టూవీలర్లకు అయితే ఇప్పుడున్న 300 రూపాయల స్థానంలో 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.