నన్ను ట్రాప్ చేయడానికి మహిళ ద్వార మెస్సేజ్ లు పంపిస్తున్నారు

న్యూ ఢిల్లీ- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వచ్చాయని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పతనావస్థలో ఉందని.. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవాళ తన వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడని రాజు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆఫ్ట్రాల్ జర్నలిస్ట్ అని, అనధికార హోం మంత్రిలా వ్యవహరిస్తున్నాడని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు సజ్జల చేస్తున్నాడని ఆరోపించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దని సూచించిన రాజు.. సజ్జల, వైఎస్ జగన్ వారి వారి పరిధిల్లో ఉండాలని అన్నారు. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోతే ప్రజ క్షేత్రంలో పరాభవం తప్పదని హెచ్చరించారు.