నెగిటివ్‌ అయినా భార్య ఒడిలోనే తుదిశ్వాస!..

సెకెండ్ వేవ్ కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. మనుషల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఓ వైపు కేసులు.. మరోవైపు మరణాలతో పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు రోజుకూ పరిస్థితి ఆందోళన పెంచుతోంది.  మరో దారుణం,. రెండు వారాల క్రితం కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం మరోసారి కరోనా పరీక్ష చేయిస్తే నెగిటివ్‌ వచ్చింది. దీంతో..ఊరికి బయల్దేరిన వ్యక్తి ఊపిరి అందక కుప్పకూలాడు. రైల్వేష్టేషన్‌లో భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు గుడుపల్లె మండలం మిద్దూరుకు చెందిన చంద్రశేఖర్‌ తన భార్య లక్ష్మీదేవితో కలిసి సుమారు 15ఏళ్ల క్రితం బెంగళూరు వలస వెళ్లాడు. అక్కడే కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాడు. కర్ణాటకలో కొవిడ్‌ తీవ్రత కారణంగా వ్యాపారం సాగక నెల క్రితం వారు సొంత గ్రామానికి చేరుకున్నారు. ఏప్రిల్‌ 23న చంద్రశేఖర్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలడంతో కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంగళవారం నెగిటివ్‌ రావడంతో తిరిగి బెంగళూరు వెళ్లాలనుకొన్నారు. గురువారం ఉదయం కుప్పం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు వస్తుందనగా చంద్రశేఖర్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు.  భార్య లక్ష్మీదేవి చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు.