అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌కు సీఎం స్టాలిన్‌.. ఆకస్మిక తనిఖీతో హడలిపోయిన పోలీసులు.. వీడియో వైరల్‌

MK Stalin

తన మార్కు నిర్ణయాలు, పరిపాలన విధానాలతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రజల మనసులు గెలుచుకున్నారు. కేవలం తమిళనాడు ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా స్టాలిన్‌ విధానాలను ఎంతో మంది మెచ్చుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఆయన ప్రభుత్వ విధానాలను కొనియాడారు. ప్రతిపక్షాలతోనే పొగిడించుకున్న చరిత్ర సీఎం స్టాలిన్‌ది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా? అని సీఎం స్టాలిన్‌ స్వయంగా తనిఖీ చేస్తుంటారు. గతంలోనూ రేషన్‌ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఈసారి తాజాగా ఓ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారాయన. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న స్టాలిన్‌ మధ్యలో అధ్యామాన్‌కోటై పోలీస్‌స్టేషన్‌ను చూసి ఆగారు. స్టేషన్‌లోకి వెళ్లి ఎస్సై కుర్చీలో కూర్చుని రికార్డులు పరిశీలించారు. ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి. నమోదైన కేసుల పురోగతి ఏంటని పరిశీలించారు. అక్కడి సిబ్బంది బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాలు పోలీసుస్టేషన్‌లో ఉన్నారు స్టాలిన్‌. సీఎం ఇలా చెప్పాపెట్టకుండా వస్తాడు అని తెలిస్తే ఎవరైనా ఒళ్లు దగ్గరబెట్టుకుని ఉంటారు కాదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.