తెలుగు ప్రజలకు శుభవార్త. త్వరలోనే ప్రతిష్టాత్మక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది. దేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన మెట్రో సర్వీసులు నగరవాసులకు, ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా మారాయి. బస్సుల్లో గంటల్లో చేరు గమ్యస్థానాలను మెట్రో ద్వారా నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. ఇప్పుడు నగర వాసులకు మరింత సౌలభ్యం చేకూరే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 18న టెండర్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబై చేరుకునే వీలు కలుగుతుంది. ఇక ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. భూసేకరణపై దృష్టిసారించిన కేంద్రం బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది.
ఈ రైలు ముంబై చేరుకునేందుకు 14 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP)పద్ధతిలో నిర్మించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ – ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ఈ రెండు నగరాల మధ్య దూరం 650 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు వివరాలను ఠాణె జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ, ఇతర అధికారులకు జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.కె.పాటిల్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పూర్తి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భాగ్యనగరం స్థాయి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.