వ్యాక్సిన్ తయారయ్యేది హైదరాబాద్ లో కానీ.. కేంద్రంపై కేటీఆర్ సీరియస్

ktr

వేములవాడ- ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌లోనే తయారవుతున్నా మన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో 85 శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. కేవలం 15 శాతం వ్యాక్సిన్ డోసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు కొనుక్కోవాలని కేంద్రం నిబంధన పెట్టడం ఎంత మాత్రం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు కొవిడ్ టీకాలను ఎగుమతి చేయకుండా ఉంటే, మన ప్రజలకు టీకాలు సరిపడ వ్యాక్సిన్ నిల్వలు ఉండేవని అన్నారు.

ktr

టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర ఏమీ లేకుండా పోయిందని వాపోయిన మంత్రి కేటీఆర్, మొత్తం కేంద్రం ఆధీనంలో ఉండడం వల్లే సమస్య వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్‌ లో వంద పడకల ఆస్పత్రిని కేటీఆర్ ప్రారంభించారు. కరోనా సోకినవారు హైదరాబాద్‌, కరీంనగర్‌ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక సిరిసిల్లలోనే చికిత్స పొందవచ్చని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. కరోనా చికిత్సలో వాడుతున్న అన్ని రకాల మందులు ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

బ్లాక్‌ ఫంగస్, వైట్‌ ఫంగస్‌కు సంబంధించిన మందులు కూడా అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తుందని, మళ్లీ మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడదని మరోసారి చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై పూర్తి విచారణ జరిపిస్తామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.