సంక్రాంతి పండగ వేళ.. భారీగా తగ్గిన వంట నూనే ధరలు

ముంబయి- సంక్రాంతి పండగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్త చెప్పింది. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆందోళన చెందుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కార్ ఉపశమనం కలిగించే కబురు అందించింది. దేశంలోని రిటైల్‌ మార్కెట్‌ లో వంట నూనె ధరలు భారీగా తగ్గు ముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంట నూనెపై 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రిటైల్‌ మార్కెట్‌ లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో 180 రూపాయలు, ఆవనూనె కిలో 184 రూపాయలు, సోయా ఆయిల్ కిలో 148 రూపాయలు, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162 రూపాయలు, పామాయిల్ కిలో ధర 128 రూపాయలుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

edible oil prices 1

అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే సోయా మరియు సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు 7 నుంచి 8 రూపాయలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు 15 నుంచి 20 రూపాయల మేర ధరలను తగ్గించాయి. వంట నూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి.

గత యేడాది భారీగా ఉన్న వంట నూనె ధరలు, అక్టోబర్‌ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణమని చెప్పవచ్చు.