కరోనా రోగులకు శుభవార్త, ఆరోగ్య శ్రీతో ఉచితంగా కొవిడ్ చికిత్స

అమరావతి- కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పధకం క్రింద చికిత్స అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పై సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. కోవిడ్ ఆస్పత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో ఉన్న సీసీసీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ వైద్య శాఖకు సూచించారు.

అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో కూడా సేవలందించాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌ కేర్‌తో పాటు వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తగినంత ఆక్సీజన్ సరఫరా, నిల్వల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, కేంద్రం కేటాయింపుతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల వద్ద 10 కెఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ ఆక్సిజన్‌ నిల్వలుండాలని ఆయన ఆదేశించారు. మొత్తం మీద కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్యం ఉచితంగా చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వాత్రా హర్షం వ్యక్తం అవుతోంది.