పాకిస్థాన్ కు మరో షాక్, టూర్ ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్

స్పోర్ట్స్ డెస్క్- దాయాది దేశం పాకిస్థాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్థాన్ జట్టుకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. తమ గడ్డపై ఇతర జట్లతో ఆడాలనుకున్న పాక్ క్రికెట్ జట్టుకు నిరాశే ఎదురవుతోంది. అనూహ్యంగా రెండు అంతర్జాతీయ మ్యాచ్ లు రద్దవ్వడంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.

గత వారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు శుక్రవారం నాడు రావల్పిండిలో తొలి వన్డేకు ముందు హఠాత్తుగా వైదొలగింది. భద్రతా కారణాలతో ఏకంగా టూర్‌ రద్దు చేసుకున్నట్టు న్యూజీలాండ్ తెలిపింది. దీంతో పాకిస్థాన్ బోర్డుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇక న్యూజిలాండ్ తో గ్రౌండ్ లోకి దిగడమే అనుకున్న తరుణంలో, మ్యాచ్ రద్దవ్వడంతో తీవ్ర నిరాశ చెందింది.

nz vs pak 1

ఇదిగో ఇటువంటి సమయంలో పాకిస్థాన్ కు మరో షాక్ తగిలింది. వచ్చే నెలలో పాకిస్థాన్‌లో తమ పురుషులు, మహిళల జట్ల పర్యటనలను భద్రతా కారణాలతో ఇంగ్లండ్‌ రద్దు చేసుకుంది. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన చేసింది. వచ్చే నెల 14, 15 తేదీల్లో పాకిస్థాన్‌తో రెండు టీ20లలో ఇంగ్లండ్‌ పురుషుల జట్టు తలపడాల్సి ఉంది. ఇక మహిళల జట్టు రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

ఐతే హఠాత్తుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ లో టీ-20 మ్యాచ్ లు ఆడలేమని చేల్చి చెప్పింది. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుున్నామని, తప్పని సరి పరిస్థితుల్లో పరుషుల, మహిళలా జట్ల టూర్ ను రద్దు చేసుకుంటున్నామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇంకేముంది పాకిస్థాన్ ఆందోళనలో పడిపోయింది.