146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో గతంలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ఇన్నేళ్ల ఆటలో ఏ ఆటగాడికీ సాధ్యం కానీ ఫీట్ నమోదు చేశాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో బ్రాడ్ తన కెరీర్ ఆఖరి బంతికి వికెట్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 91వ ఓవర్ చివరి బంతికి ఆసీస్ ప్లేయర్ అలెక్స్ కారీ.. కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు సంబురాల్లో మునిగిపోగా.. స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్ కు లాస్ట్ బాల్ వికెట్ తో ఘనంగా ముగించాడు. దీంతో సహచరులంతా బ్రాడ్ ను అభినందనల్లో ముంచెత్తారు. కెరీర్ చివరి బంతికి వికెట్ తీసిన వాళ్లు గతంలోనూ ఉన్నా.. బ్యాట్ తో తానెదుర్కొన్న చివరి బంతికి సిక్సర్ బాది.. వికెట్ తీసిన వాళ్లలో మాత్రం బ్రాడ్ మొట్ట మొదటి వాడు కావడం విశేషం.
ఆసీస్ తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రాడ్.. 8 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కంగారూ పేసర్ మిషెల్ స్టార్క్ వేసిన బంతిని స్క్వైర్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. మరుసటి ఓవర్లో అండర్సన్ ఔౌట్ కావడంతో బ్రాడ్ నాటౌట్ గా మిగిలాడు. ఇలా తన కెరీర్ చివరి బంతికి సిక్సర్ బాదిన బ్రాడ్.. లాస్ట్ బాల్ కు క్యారీని ఔట్ చేయడం ద్వారా అరుదైన ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించగా.. సిరీస్ 2-2 తో సమమైంది.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలుపొందింది. వర్షం కారణంగా నాలుగో టెస్టు ‘డ్రా’ గా ముగియగా.. రసవత్తరంగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ ను విజయం వరించింది. బజ్ బాల్ ఆట తీరు కొనసాగించిన ఇంగ్లిష్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులు చేసింది. దీటుగా బదులిచ్చిన ఆసీస్ 295 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో దంచికొట్టిన ఇంగ్లండ్ 395 పరుగులు చేసి ప్రత్యర్థి ముంగిట 384 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాపార్డర్ రాణించడంతో ఒక దశలో సునాయాసంగా టార్గెట్ ఛేజ్ చేసేలా కనిపించిన ఆసీస్.. చివరకు 334 పరుగులకు ఆలౌటైంది. సిరీస్ ‘డ్రా’ అయినా ట్రోఫీ మాత్రం ఆసీస్ కే దక్కింది.