సంసారం అన్నాక చిన్నాచితక గొడవలు కామన్. కానీ.., ఆ మాత్రం దానికి మర్డర్ ప్లాన్స్ వేసి, ప్రాణాలు తీసే వరకు వెళ్లడం దుర్మార్గం. తాజాగా ఇలాంటి పనే చేసింది ఓ ఇల్లాలు. తనని పట్టించుకోకుండా, చీటికి మాటికి తిడుతున్న భర్తని అంతమొందించాలి అనుకుంది. అందుకు ఆమె వేసిన మర్డర్ ప్లాన్ కూడా మరీ దారుణంగా ఉంది. నిద్రపోతున్న భర్త పురుషాంగంపై సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది ఆ భార్య. హఠాత్తు పరిణామంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్త ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ.. అసలు ఆ భార్యభర్తలు ఎవరు? ఆమె ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడిందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావు టైలర్ గా జీవిస్తున్నాడు. అతని భార్య పద్మావతి. వీరికి ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. పెళ్లి అయ్యాక ఇన్నాళ్లు బాగానే ఉంటూ వచ్చిన నాగేంద్ర, పద్మావతి మధ్య ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి. ఈ దెబ్బతో భార్యభర్తలు మాట్లాడుకోవడమే మానేశారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా.. మళ్ళీ గొడవే అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో భర్త.. తనని పట్టించుకోకుండా ఎవరితోనో తిరుగుతున్నాడు అని భార్య పద్మావతి అనుమాన పడింది. ఆ ఆవేశంలోనే భర్తని కడ తేర్చాలని నిర్ణయించుకుంది.
పక్కా ప్లాన్ ప్రకారం.. తాను అనుకున్నది అమలు చేసింది ఆ భార్య. భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని మర్మాంగంపై పడేలా ఒక్కసారిగా పోసేసింది. తీవ్రంగా గాయపడిన భర్త కేకలు వేయడంతో.. ఇరుగుపొరుగు వారు వచ్చి నాగేంద్రని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ప్రస్తుతం ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నాగేంద్రకి చికిత్స అందుతోంది. ఏలూరు టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ బృందం నిందితురాలు పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. భార్య పద్మావతి నాగేంద్రకి మూడో భార్యగా తేలింది. మరి.. కేవలం అనుమానం కారణంగా భర్త మర్మాంగంపై వేడి నీరు పోసిన ఈ భార్యకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.