హైదరాబాద్‌ లో పెరిగిన రోడ్డు ప్రమాద మరణాలు.. భయపెడుతున్న బ్లాక్‌స్పాట్స్!..

Heavey Road Accidents In Hyderabad - Suman TV

హైదరాబాద్‌ నగరాన్ని ప్రమాదరహిత నగరంగా మార్చేందుకు ఎన్నో ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నప్పటికీ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు నగరంలో 2020లో జరిగిన ప్రమాదాల గణాంకాల ఆధారంగా 50 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. రెండు నెలల క్రితం బ్లాక్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, కంటోన్మెంట్‌ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌లో 2020లో జరిగిన ప్రమాద గణాంకాల ఆధారంగా ఈ ఏడాది జరిగిన ప్రమాదాలలో ఎక్కువగా అతివేగం కారణంగానే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జూన్‌ చివరి వరకు రోడ్డు ప్రమాదాల్లో  ఆరుగురు డ్రంకెన్‌ డ్రైవ్‌, 8 మంది రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వల్ల, 15 మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో, ఇద్దరు వాహనానికి కుక్కలు ఎదురు రావడంతో, మరో ఐదుగురు ఇతరత్రా కారణాలతో మృతి చెందినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. మృతుల్లో మరో 39 మంది పాదచారులున్నారు.

ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల వేలాది మంది బతుకులు గాలిలో కలిసి పోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మలుపుల వద్దే జరుగుతున్నాయి. మలుపులు, ఇరుకు రోడ్లు, వంతెనల్ని బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలకు సిద్ధమయ్యారు.   ప్రమాదంతో పాదచారి మృతి చెందాడనే సమాచారం అందగానే ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

Heavey Road Accidents In Hyderabad - Suman TVవేర్వేరు ప్రమాదాల కారణాలను విశ్లేషించి శాశ్వత పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పాదచారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కొన్ని రోజుల క్రితమే జీహెచ్‌ఎంసీని కోరారు. ఫుట్‌పాత్‌లను కబ్జా చేసిన ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాటిని క్లియర్‌ చేస్తున్నారు.  నగరంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గుంతలను పూడ్చేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది అని అధికారులు చెబుతున్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గ్రేటర్‌లో పలు సర్కిళ్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో మొత్తం 7,248 పాట్‌ హోల్స్‌ గుర్తించామని, అందులో 6,321 గుంతలను పూడ్చామని అధికారులు తెలిపారు. మిలిగిన వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు.