ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు

ముంబయి- బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించి, షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ డ్రగ్ కేసులో తన తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కోర్టు ఎప్పటికప్పుడు ఆర్యన్ బెయిల్ పిటీషన్ ను తిరస్కరిస్తూ వస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో ఈ క్రుయిజ్ డ్రగ్స్ కేసులో మొదటిసారి ఇద్దరికి ఊరట లభించింది. ముంబై లోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు మంగళవారం మనీశ్ రాజ్గరియా, అవిన్ సాహూకు బెయిల్ మంజూరు చేసింది.

Aryan Khan

ముంబయి తీరంలోని క్రూయిజ్ లో అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్‌ తో పాటూ అరెస్టైన వారిలో వీళ్లిద్దరు కూడా ఉన్నారు. ఐతే పార్టీకి వచ్చిన వారిలో మనీశ్ రాజ్గారియా, అవిన్ సాహూ కూడా అతిథులుగా ఉన్నారని ఎన్సీబీ చెబుతోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేసులో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. వారిలో ఇప్పుడు ఒడిషాకి చెందిన మనీశ్ రాజ్గారియా, అవిన్ సాహూలకు బెయిల్ లభించింది.

ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ బాంబే హైకోర్టులో విచారణలో ఉంది. ఈ బెయిల్ పిటీషన్ పై బుధవారం వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆర్యన్ ఖాన్ కు సైతం బుధవారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కూడా తన తనయుడు ఆర్యన్ కు హైకోర్టు తప్పకుండా బెయిల్ ఇస్తుందన్న ఆశతో ఉన్నారు.