తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు- సీఎం కేసీఆర్

cm kcr

హైదరాబాద్- తెలంగణలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారానికి తెర పడింది. తెలంగాణలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌ డౌన్ ఏ మాత్రం పరిష్కారం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదని, అంతే కాకుండా లాక్ డౌన్ వల్ల జనజీవనం స్థంభించిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలోని ప్రస్తుత కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై సుమారు 4 గంటల పాటు అధికారులతో సీఎం చర్చించారు.

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు సీఎం. రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా వలస కార్మికులున్నారని చెప్పిన కేసీఆర్.. మొదటి వేవ్‌లో లాక్‌ డౌన్‌ తో వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని మనం చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు లాక్‌ డౌన్‌ విధిస్తే వీరంతా తమ రాష్ట్రాలకు వెళ్లి తిరిగి రావడం కష్టమేనని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పుష్కలంగా ఉందని.. 6 వేల 144 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నెల 15 తర్వాత సెకండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు చెబుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని.. స్వీయ నియంత్రణ పాటించి.. మన జాగ్రత్తలే శ్రీరామరక్ష అనే విషయాన్ని మరిచిపోవొద్దని చెప్పారు. పెళ్లిళ్లలో వందకు మించి జమ కావొద్దని.. పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందొద్దని చెప్పిన ముఖ్యమంత్రి.. ముందస్తుగా ప్రభుత్వం అందజేసే కొవిడ్‌ కిట్లను వినియోగించుకోవాలని చెప్పారు.