అమరావతి- మోగాస్టార్ చిరంజీవితో పాటు తెలుసు సినిమా పరిశ్రమపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ సహకరించలేదని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాదు సినీ పరిశ్రమలోని చాలా మంది తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చెప్పారు. తనకు, టీడీపీ పార్టీకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ అనకూలంగా వ్యవహరించలేదని అన్నారు చంద్రబాబు.
తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఈ పేపర్‌ను చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీ వల్ల తాను నష్టపోయినట్లు చంద్రబాబు చెప్పారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోయి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి పార్టీ పెట్టక ముందు తనకు మంచి స్నేహితుడని, ఆ తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో స్నేహపూర్వకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ ఆటలో పోరాటం అనేది ఓ భాగమని, వీటన్నింటినీ దాటుకుని రాజకీయంగా ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక సినిమా టిక్కెట్ ధరల అంశంలోకి అనవసరంగా టీడీపీ పార్టీని లాగుతున్నారని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుతం 50 శాతం మంది ప్రజలు ఆన్ లైన్ ఉంటున్నారని, వార్తలు చదివే విధానంలో చాలా మార్పులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ప్రజల అభిరుచి మేరకే రీజనల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయని, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని భావించే ప్రతి ఒక్కరూ టీడీపీ ఈపేపర్ చదవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టక ముందు నుంచి ఉన్న న్యూస్ పేపర్లపై కులముద్ర వేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.