అతడు పెట్టేది తిరునామం.. కానీ ఇంటి నిండా నోట్ల కట్టలు

తిరుపతి రూరల్- తిరుమల కొండపైన ఓ వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలను చూసి టీటీడీ విజిలెన్స్ అధికారులు కళ్లు తేలేశారు. రెండు పెద్ద ట్రంకు పెట్టెల్లో డబ్బులను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. తిరుమల కొండపైన శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీనివాసులు అనే వ్యక్తి తిరునామం పెట్టే వాడు. భక్తులు తమకు తోచింది ఇస్తే తీసుకునేవాడు. శ్రీనివాసులు చేస్తున్న సేవను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికంగా శేషాచలనగర్ లో ఓ ఇంటిని కెటాయించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు శ్రీనివాసులు ఆ ఇంటిలోనే ఉంటున్నాడు. అతనికి ఎవరు లేకపోవడంతో ఒంటరిగానే ఉంటూ వస్తున్నాడు శ్రీనివాసులు. ఐతే ఈ క్రమంలో గత యేడాది శ్రీనివాసులు అనారోగ్యంతో చనిపోయాడు. ఎవరు లేకపోవడంతో అప్పుడు టీటీడీ అధికారులే శ్రీనివాస్ మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు.

notes

చాలా కాలం భక్తులకు తిరునామం పెట్టిన శ్రీనివాస్ అనాధలా చనిపోవడంతో శేషాచలనగర్ లోని వారంతా అయ్యో పాపం అనుకున్నారు. ఇక ఇన్నాళ్లకు శ్రీనివాసులుకు కెటాయించిన 75వ నెంబర్ ఇంటిని స్వాదీనం చేసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెళ్లారు. ఇంట్లో పరిశీలించగా అక్కడ రెండు పెద్ద ట్రంకు పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో అన్నీ నోట్ల కట్టలే. వాటిని చూసి టిటిడీ విజిలెన్స్ అధికారులు నివ్వెరైపోయారు. కేవలం తిరునామం పెట్టి భక్తులు ఇచ్చే పదో పరకో తీసుకుని జీవనం సాగించే శ్రీనివాసులుకు అంత డబ్బు ఎక్కడిదని అంతా ఆశ్చర్యపోయారు. ట్రంకుపెట్టెల్లోని డబ్బులను విజిలెన్స్ అధికారులు లెక్కిస్తున్నారు. శ్రీవారి వీఐపీ భక్తులకు తిరునామాలు పెట్టిన సందర్బాల్లో బాగానే డబ్బులు టిప్పుగా ఇచ్చేవారని, అలా వచ్చిన డబ్బులను శ్రీనివాసులు దాచుకుని ఉంటాడని భావిస్తున్నారు.