ఏపీ డిప్యూటీ సీఎం పుష్పవాణికి హైకోర్టులో చుక్కెదురు, నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం

అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కోర్టుల్లో చాలా అంశాల్లో చుక్కెదురవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు, వైసీపీ ప్రభుత్వానికి సంబందించిన చాలా పిటీషన్లకు సంబందించిన కోర్టు తీర్పుల్లో వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టులో చుక్కెదురైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి కులంపై హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. పుష్పవాణి అసలు ఎస్టీ కాదని, కానీ ఆమె ఎస్టీ కోటాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై గురువారం విచారణ జరగగా, పిటిషనర్ తరపు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదన్న ఫిర్యాదుపై అప్పీలు విచారణ గిరిజన శాఖ మంత్రి దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

Pushpavani 1

ఐతే పుష్ప శ్రీవాణినే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్‌పై ఆవిడే విచారణ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్ధించారు.

కుల ధ్రువీకరణ పత్రంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శ్రీవాణిని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.