తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆలయాల పూజ కార్యక్రమాలు న్యాయస్థానం పరిధిలోకి రావంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. పిటిషనర్ కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. శ్రీవారికి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో అభ్యంతరాలుంటే టీటీడీ యజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పింది.
పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని టీటీడీకి సుప్రీం కోర్టు సూచించింది. స్వామివారికి పూజా కైంకర్యాలపై టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లోగా స్పందించాలని టీటీడీకి సూచించింది. కాగా స్వామివారి భక్తుడు ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడంలేదని పిటిషన్ వేశారు. ఆగమశాస్త్రం ప్రకారమే పూజలు జరుగుతున్నాయని టీటీడీ గతంలోనే అఫిడవిట్ దాఖలు చేసింది.