మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాధం

తిరుపతి- టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ బాబు తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు కన్ను మూశారు. గత కొంత కాలంగా రంగస్వామి నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ నేపధ్యంలో గుండె పోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోదరుడిని కోల్పోయిన నేపధ్యంలో మోహన్ బాబు కన్నీరుమున్నీరవుతున్నారు.

rangaswamy naidu no more

ఇక మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 9 గంటల సమయంలో తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి నాయుడు, మోహన్‌ బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.

మంచు రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మంచు రంగస్వామి నాయుడు అంత్యక్రియల కోసం మోహన్ బాబు కుటుంబం ఇప్పటికే తిరుపతి చేరుకుంది.