చైనా (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా మహమ్మారి విజృంభనతో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ సోకి రోజూ లక్షల మంది అనారోగ్యం పాలవుతున్నారు. కరోనా నుంచి కోలుకోకముందే ప్రపంచం నెత్తిన చైనా మరో బాంబు పేల్చింది. చైనా దేశం అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోందట. అది ఏ క్షణమైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. రోటీన్ గా ఐతే కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడిపోతుంటాయి. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మాత్రం భూమి వైపు దూసుకువస్తోందని తెలుస్తోంది. దీంతో అది ఎక్కడ పడుతుందో అర్ధంకాక శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు. చైనాకు సంబిందించిన 5బీ రాకెట్‌ను ట్రాక్ చేసేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న ఈ రాకెట్ భూమ్మీద పడే అవకాశం ఉందని పెంటగాన్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేక తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఏ క్షణానైనా భూమిపై పడే ఛాన్స్ ఉన్న లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ బరువు సుమారు 21 టన్నులు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా ప్రయత్నాల్లో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ తియాన్హే స్పేస్ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. అక్కడ నియంత్రణ కోల్పోయిన రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో అది ఈనెల 8న ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ ప్రాంతంలో పడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.