కోల్ కతా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందు నుంచి ఉత్కంఠ రేపింది. కానీ చివరకు బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి విజయం సాధించారు. తొలుత 1200 ఓట్లతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గెలిచారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సుబేందు 1,622 పైగా ఓట్లతో గెలుపొందారని తేలింది. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. సుబేందు అధికారి గెలుపును ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సుబేందు గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సీఎం మమత నందిగ్రామ్‌లో ఓటమి చెందారని.. బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి 1,622 ఓట్లతో విజయం సాధించారని ఆయన చెప్పారు.ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా దీదీ సీఎం పదవిలో కొనసాగడానికి ఏం అధికారం ఉందని అమిత్ మాలవ్య ప్రశ్నించారు.
అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈసీ నందిగ్రామ్ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉందని, పుకార్లు వ్యాపింపచేయవద్దని సూచించింది. మరోవైపు సీఎం మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు. నందిగ్రామ్ గురించి ఏమీ చింతించకండి అని చెప్పిన మమత.. ఒక్క సీటుతో వచ్చేదేమీ ఉండదని.. పోయేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నానని మమత చెప్పారు. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో మరిచిపోండన్న దీదీ… మనం బెంగాల్‌ను గెలిచామని అన్నారు. ఇక నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తానని మమతా బెనర్జీ ప్రకటించింది.