కోల్ కత్తా- మమతా బెనర్జీ.. అలియాస్ దీదీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మొన్న జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు మమత. ఈ సారి దీదీని ఓడించి, బెంగాల్ లో పాగా వేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా శతవిధాలుగా ప్రయత్నించినా వారి పాచికలు పారలేదు. బీజేపీ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినా బెంగాల్ ప్రజలు మాత్రం మళ్లీ మమతకే పట్టం కట్టారు. దీంతో దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ సత్తా ఎంటో మరోసారి నిరూపితమైంది. ఇక ముందు నుంచి ప్రధాని మోదీకి, దీదీకి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ విషయంలోను మోదీకి, మమతకు అస్సలు పడదు. దీంతో ఇరువురు వియ్యమంటే కయ్యం అంటుంటారు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రధాని మోదీని తన కోసం ఎదురుచూసేలా చేసింది మమతా బెనర్జీ.
అది కూడా నిమిషమో, రెండు నిమిషాలో కాదు.. ఏకంగా 30 నిమిషాల పాటు ప్రధాని, దీదీ కోసం వెయిట్ చేశారు. యాస్ తుపాను నేపధ్యంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం కోల్ కత్తాలో తుఫాను పరిస్థితులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఐతే ముందు ఈ సమావేశానికి తాను హాజరు కానని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవుతారని సీఎం మమత చెప్పారు. ఇంతలోనే మనసు మార్చుకున్న దీదీ, ప్రధాని మోదీ నిర్వహించే సమీక్షా సమావేశానికి హాజరవుతానని కబురు పంపించింది. దీంతో సమీక్షను ఆపి, ముఖ్యమంత్రి మమత కోసం ప్రధాని మోదీ ఎదురు చూశారు. సుమారు 30 నిమిషాల తరువాత ఈ సమావేశానికి మమత వచ్చారు.
దీదీ వచ్చాక తుఫానుపై సమీక్షను ప్రారంభించారు ప్రధాని మోదీ. అయినప్పటికీ ముఖ్యమంత్రి మమత ఎక్కువ సేపు సమావేశంలో ఉండలేదు. తుపానుకు సంబంధించిన కొన్ని వివరాలను ప్రధాని మోదీకి సమర్పించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక సమీక్షా సమావేశాన్ని కంటిన్యూ చేశారు మోదీ. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలా దేశ ప్రధానిని వెయిట్ చేయించడం, సమీక్షా సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, ప్రభత్వ కార్యక్రమాల్లో ప్రధానిని అవమానించడం సరికాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.