సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ (మే 31న) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దాదాపు ప్రతి ఏడాది కృష్ణ జన్మదిన కానుకగా మహేశ్‌బాబు సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ నుంచి అప్‌డేట్ రావడం లేదు. అయితే ఫ్యాన్స్‌కి ఓ కానుక సిద్ధమైంది.
కృష్ణ చేసిన అద్భుత పాత్రల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకటి. ఆయన పుట్టినరోజు సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ పాడిన విప్లవ గీతాన్ని కృష్ణ అభిమానులకు అంకితమిస్తూ, ‘ఊర్వశి’ ఓటీటీ వారు విడుదల చేస్తున్నారు. దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆర్.పి పట్నాయక్, మౌనిక పాడారు. ‘ఊర్వశి’ ఓటీటీ ఎమ్.డి రవి కనగాల, సీఈఓ రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కృష్ణగారిపై ఓ పాటను ఆయన బర్త్‌డే కానుకగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ, విడుదల చేయడం గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేష్‌కి థ్యాంక్స్’’ అన్నారు.