ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వడం గురించి వినే ఉంటారు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం ఇందులో అంతకు మించి అనే చెప్పాలి. తమ కంపెనీలోని ఒక ఉద్యోగికి ఆయన ఏకంగా వేల కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చారు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. భారత్‌కు చెందిన ఈ బిలియనీర్ ఏం చేసినా స్పెషలే. ఆయనకు సంబంధించిన చిన్న వార్త కూడా క్షణాల్లో తెగ వైరల్ అయిపోతుంది. తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని కొనసాగిస్తూ భారత్‌లోనే టాప్ వ్యాపారవేత్తగా, అపర కుబేరుడిగా పేరు తెచ్చుకున్నారు ముఖేశ్. రియలన్స్ సంస్థను ఏటేటా విస్తరిస్తూ పోతున్నారాయన. జియో ద్వారా టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించారు ముఖేష్ అంబానీ. అలాంటి ఆయన తమ సంస్థ ఉద్యోగులను బాగా చూసుకుంటారనే పేరుంది. ఇది మరోమారు నిరూపితమైంది. తమ ఎంప్లాయీస్ విషయంలో ముఖేష్ అంతకు మించి అనే రేంజ్లో ఆలోచిస్తారని రుజువైంది. ఏ సంస్థ యజమానులు అయినా తమ ఉద్యోగులకు పండుగలకో పబ్బాలకో బోనస్‌లు ఇస్తుంటారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వాళ్లందరి కంటే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఒక ఉద్యోగికి ఆయన ఏకంగా రూ.1,500 కోట్ల ఖరీదు చేసే ఇంటిని బహుమతిగా ఇచ్చేశారు. ముఖేష్ ‘రైట్ హ్యాండ్’గా పిలిచే మనోజ్ మోడీకి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన బిల్డింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. 22 అంతస్తుల ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న మనోజ్ మోడీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ-మనోజ్ మోడీలు ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వీళ్లు కలసి చదువుకున్నారు. రిలయన్స్ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోడీ పాత్ర ఎంతో కీలకం అని వ్యాపార వర్గాలు అంటున్నాయి.