జియో నుంచి మరో చమత్ ‘కార్’ ఆఫర్… ఎగిరే కార్లు!!.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పూర్తి స్థాయి అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటెజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ 26.76 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.197 కోట్లు) అమెరికాకు చెందిన ఇన్వెస్టీ కంపెనీ స్కైట్రాన్‌లో మరింత వాటా కొనుగోలు చేయబోతోంది. దీంతో ఆ సంస్థలో తమ వాటా 54.46 శాతానికి చేరనున్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. ‘స్కైట్రాన్‌లో మెజార్టీ ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచాన్ని మార్చే భవిష్యత్‌ సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడంలో తమ నిబద్ధత వెల్లడవుతోంద’ని ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. యూఎస్‌లోని డెలావర్‌ చట్టాల ప్రకారం, ఏర్పాటైన సాంకేతిక సంస్థ స్కైట్రాన్‌. ఇది ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇందుకోసం వ్యక్తిగత రవాణా వ్యవస్థల్లో అమలు చేయడానికి వీలుగా పాసివ్‌ మాగ్నెటిక్‌ లెవిటేషన్‌, ప్రొపల్షన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో కలసి జెర్రీ శాండర్స్, కొంతమంది ఔత్సాహిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అద్బుతమైన ఆలోచన ఇది!

technology bg min 1020x713 2

 

చైనా, జపాన్‌లలో నడుస్తున్న మ్యాగ్‌లెవ్ ట్రెయిన్స్ కు రివర్స్ టెక్నాలిజీ ఇది. బలమైన అయస్కాంతాలతో కూడిన ట్రాక్‌పై గాల్లో తేలుతున్నట్లు వేగంగా కదులుతాయి ఆ మ్యాగ్‌లెవ్ ట్రెయిన్లు. ప్రయాణీకులతో కూడిన ట్యాక్సీల్లాంటి వాహనాలు స్కైట్రాన్‌ 20 అడుగుల ఎత్తయిన స్తంభాలను కలుపుతూ వేసిన అయస్కాంత ట్రాక్‌కు వేలాడుతూ ప్రయాణిస్తాయి. మోడల్‌ను బట్టి ఒక్కో వాహనంలో ఇద్దరు, నలుగురు కూర్చునే వీలుంది. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మనం ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించవచ్చు. మధ్యలో ఎక్కడా స్టాప్‌లు లేకపోవడం, మన స్టాప్ వచ్చిన చోట మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా వెహికల్ కిందికి దిగిపోవడం ఈ సిస్టమ్ ప్రత్యేకతలు. ఒక్కో మైలు స్కైట్రాన్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. మెట్రో రైలు ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటర్‌కు రూ.160 నుంచి రూ.280 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. భారత్‌ ట్రాన్స్‌పోర్ట్ రంగం కొత్త పుంతలు తొక్కే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.