మతిపోగొడుతున్న మహీంద్రా XUV700.. 57 నిమిషాల్లో 25 వేల బుకింగ్స్‌

XUV 700 car

మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి విడుదలైన సరికొత్త XUV700 క్రేజ్‌ మామూలుగా లేదు. మార్కెట్‌లో బుకింగ్స్‌ స్టార్ట్‌ చేయగానే హాట్‌ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ఈ కారు బుకింగ్స్‌ గురువారం ప్రారంభించగా కేవలం 57 నిమిషాల్లో 25 వేల కార్లు బుక్‌ అయినట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సెప్టెంబరు నెలాఖరులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేశారు. దీని స్టార్టింగ్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.11.99 లక్షలుగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.21.09 లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో 9 వేరియంట్లల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆల్‌వీల్‌ డ్రైవ్‌  ఫీచర్‌ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.

‘XUV700 కోసం గురువారం ఉదయం 10 గంటలకు బుకింగ్స్‌ తెరిచాం. 57 నిమిషాల్లోనే 25వేల మంది బుక్‌ చేసుకున్నారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో తెలిపారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూసి ఆనంద్‌ మహీంద్రా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.