జనాలు చేపలను రెండు రకాలుగా వినియోగిస్తారు. ఒకటి తినడానికి, రెండోది అక్వేరియంలో పెంచుకోవడం కోసం. తినే చేపలు అయితే ఎంత ఎక్కువ అనుకున్నా.. వేయి, రెండు వేల మధ్య ఉంటాయి. అదే అక్వేరియాలో పెంచే చేపలు అయితే రూ.10 నుంచి రూ.20 వేలు ఉంటాయి. మరికొన్ని చేపలు అయితే ఇంకొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి. కానీ.. ఓ రకం చేప మాత్రం ఏకంగా 2 నుంచి 3 కోట్ల ధర పలుకుతుంది. అంత ధర ఉన్నా.. కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఈ చేపను కొనుగోలు చేసిన తర్వాత దాని భద్రత కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ప్రత్యేకంగా కాపాలదారులను నియమిస్తారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం! అయితే.. అంతలా ఈ చేపలో ఏమి ప్రత్యేకత ఉందో ఇప్పడు తెలుసుకుందాం..
ఆ ప్రత్యేకమైన చేప పేరు.. డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా. ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరు గాంచింది. చైనాలో ప్రజలు ఈ చేపను తమ స్టేటస్ కి చిహ్నంగా భావిస్తారు. ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు. ఒక నివేదిక ప్రకారం.. చైనాలోని ధనవంతులు దీని కోసం అడిగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.ఈ చేపల కోసం జనం జైలుకి కూడా వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు.
కొన్ని శతాబ్ధాల క్రితం డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్ ఫిష్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. అందుకే ఇక్కడ అక్రమంగా డ్రాగన్ ఫిష్ విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదు. స్టేటస్ సింబల్ గా భావిస్తున్న ఈ డ్రాగన్ ఫిష్ ధర ఇన్ని కోట్లు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.