వైద్యో నారాయణో హరి అంటూ ఉంటారు. వైద్యులు దేవుడితో సమానం అని దాని అర్థం. వైద్య వృత్తిని దైవంగా భావించే వైద్యులు దేవుళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. వారు నిత్యం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. బతకటం అసాధ్యం అనుకున్న వారికి కూడా ప్రాణాలు పోస్తూ ఉంటారు. ఒక్కోసారి రోగుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. తాజాగా, ఓ డాక్టర్ తన ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తికి వైద్యం చేశాడు. ఆ వ్యక్తి రొమ్ములో ఉన్న గ్రెనేడ్‌ను బయటకు తీశాడు. ఆపరేషన్ సందర్భంగా అది పేలుతుందని తెలిసినా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆపరేషన్ చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. రష్యా ట్రూపుల కారణంగా ఎంతో మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.. తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఉక్రెయిన్ సైనికుడు గ్రెనేడ్ దాడిలో గాయపడ్డాడు. గ్రెనేడ్ లాంఛర్ ద్వారా వదలిన గ్రెనేడ్ ఏకంగా అతడి రొమ్ములో దిగబడింది. ఏ మాత్రం అటు,ఇటు అయినా అది పేలేలా ఉంది. ఆ సైనికుడు రొమ్ములో గ్రెనేడ్ ఇరుక్కుపోయిన కారణంగా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. గ్రెనేడ్ బయటకు తీస్తే బతుకుతాడు. అయితే, గ్రెనేడ్ బయటకు తీసే క్రమంలో అది పేలే అవకాశం ఉంది.
ఈ విషయం తెలిసినా కూడా మిలటరీ డాక్టర్ ఆండ్రి వెర్బా ఆపరేషన్ చేయటానికి పూనుకున్నారు. మరో ఇద్దరి సహాయంతో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ గ్రెనేడ్‌ను సైనికుడి రొమ్ములోంచి బయటకు తీశాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెర్భా తెలిపాడు. కాగా, వెర్భా ఉక్రెయిన్‌లో పేరు మోసిన డాక్టర్. ఆయన సేవలకు గానూ పలు రివార్డులు, అవార్డులను సైతం అందుకున్నారు. మరి, తన ప్రాణాలకు తెగించి ఓ సైనికుడి రొమ్ములోంచి ప్రమాదకరమైన గ్రెనేడ్‌ను బయటకు తీసిన వెర్బాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.