auto driver : బెంగళూరుకు చెందిన నికితా అయ్యర్ హైవే రోడ్డు పక్క నిలబడి ఉంది. చాలా సేపటినుంచి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది. బస్సు రావటం లేదు. ఆఫీసుకు లేటవుతోంది. ఆమెకు చిరాకుగా ఉంది. అసహనంగా పదేపదే వాచీ వైపు.. రోడ్డు వైపు చూసుకుంటూ ఉంది. ఈ టైంలో ఓ ఆటో ఆమె పక్కగా వచ్చి ఆగింది. ‘‘ ప్లీజ్ కమిన్ మ్యామ్, యూ క్యాన్ పే వాట్ యూ వాంట్( ఆటో ఎక్కండి మేడమ్.. మీకు నచ్చినంత ఇవ్వండి!) అన్నాడు ఆటోలో ఉన్న 74 ఏళ్ల ముసలి ఆటో డ్రైవర్. నిఖిత ఆశ్చర్యపోయింది. ఆటో డ్రైవర్ ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటి అనుకుంది మనసులో. మారు మాట్లాడకుండా ఆటో ఎక్కి కూర్చుంది.
ఆటో కొద్ది దూరం పోగానే ‘‘ మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు’’ అని అడిగింది.
‘‘నేను గతంలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాను. ఎంఏ, ఎంఈడీ చదివాను’’ అని చెప్పాడు.
ఇంత చదువు చదివి, ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసిన వ్యక్తి ఆటో నడపటం ఏంటి? అనుకుంది. ఆమె ఏం అడగబోతోందో అతడు గుర్తించాడు. వెంటనే ‘‘ నేను ఎందుకు ఆటో నడుపుతున్నాను.. అని మీరు అడగబోతున్నారు.. అవునా?’’ అన్నాడు. ఆమె అవునని తలూపింది.
‘‘నేను గత 14 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. కర్ణాటకలో ఉద్యోగం దొరక్కపోవటంతో ముంబైలోని ఓ కాలేజ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరాను. ఇక్కడ నా కులం గురించి ఆడిగారు. నా పేరు పట్టాభి రామన్ అని చెప్పాను. అంతే ఉద్యోగం రాలేదు. అందుకే ముంబై వచ్చేశా.
పావాయ్ కాలేజ్‌లో ఉద్యోగం దొరికింది. 20 ఏళ్లుగా అక్కడే పనిచేశాను. 60 ఏళ్ల వయసులో రిటైర్ అయి కర్ణాటకకు వచ్చేశాను. ఇక అప్పటినుంచి ఆటో నడుపుతున్నాను. సాధారణంగా టీచర్లకు మంచి జీతం ఉండదు. 10-15 వేలు ఇస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పెన్షన్ కూడా ఉండదు. ప్రస్తుతం ఆటో నడపటం ద్వారా రోజుకు 700-1500 సంపాదిస్తున్నాను. అది నాకు, నా గర్ల్ ఫ్రెండ్‌కు సరిపోతుంది’’అంటూ నావ్వాడాయన. నికిత కూడా ఆయనతో పాటే నవ్వింది.
‘‘మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?..’’ అని ఆశ్చర్య నిండిన కళ్లతో అడిగింది.
‘‘ తను నా భార్య.. నా భార్యను నేను గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాను. ఎందుకంటే భార్యను మనతో సమానంగా చూడాలి కాబట్టి. ఎప్పుడైతే మనం భార్య అంటామో.. భర్త కంటే ఆమె తక్కువ అనే భావం కలుగుతుంది. భానిసల్లా అనుకుంటాం. కానీ, నా భార్య నాకంటే ఏమాత్రం తక్కువ కాదు. కొన్ని సమయాల్లో నాకంటే ఎక్కువ. తనకు 72 ఏళ్లు. నేను ఇంట్లో లేని 9-10 గంటల్లో ఇంటి పనులన్నీ చేసుకుంటుంది. మేం ఇప్పుడు 1బీహెచ్‌కేలో ఉంటున్నాం. అద్దె 12 వేలు.. ఆ అద్దె చెల్లించటంలో నా కొడుకు సహాయం చేస్తాడు. కానీ, నేను మాత్రం నా పిల్లల మీద ఆధారపడకూడదని అనుకుంటున్నా. వాళ్ల జీవితాన్ని వాళ్లు.. మా జీవితాన్ని మేము హ్యాపీగా గడపాలి.
నేను ప్రయాణించే రోడ్డులో నేనే రాజును.. ఏ టైంలో నైనా నా ఆటోను తీస్తాను. ఇష్టం వచ్చినపుడు పనిచేసుకుంటా’’ అని అన్నాడు. ఈ సంభాషణ మొత్తం 40నిమిషాల పాటు సాగింది. నికిత ఆఫీసు వచ్చింది. ఆటో దిగి, డబ్బులు చెల్లించింది. డబ్బులు తీసుకుని ఓ చిరునవ్వు నవ్వి ఆయన అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఓ అద్భుతాన్ని దూరం చేసుకుంటున్నట్లు ఆమెకు బాధేసింది. ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పెదాలపై చిరునవ్వు కదలాడింది. సంతోషంగా ఆఫీసు వైపు నడిచింది.. ఈ ఆటో డ్రైవర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వైరల్ : ఉన్నట్టుండి ఫ్రెండ్ తలపై 20 కేజీల డంబెల్ పడేశాడు..