ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌కు, ప్రైవేటు రవాణా సంస్థ రాపిడోకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. రాపిడో సంస్థ యాడ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీసేలా అంశాలు ఉన్నట్లు గ్రహించిన ఆర్టీసీ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. కాగా మెరుగైన సమాజం కోసం ప్రజాదరణ ఉన్న నటీనటులు ప్రజా ప్రయోజనమైన యాడ్స్‌లో నటించాలని సజ్జనార్ కోరారు. ఇప్పటికే ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఖరీదైనా రాపిడో రైడ్స్‌ను ఆర్టీసీ లాంటి సంస్థతో పోల్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కాగా ఈ యాడ్‌లో అల్లు అర్జున్ ఒక చిన్న హోటల్ యజమానికిగా కనిపిస్తూ దోశలు వేస్తుంటారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్‌తో రాపిడో రైడ్స్ గురించి వివరిస్తూ.. ‘బస్సులో అయితే ఇలా నలిగిపోతారు.. అందుకే హాయిగా రాపిడోలో వెళ్లిపోండి’ అంటూ పరోక్షంగా సలహా ఇస్తారు. ఈ యాడ్ వల్ల ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే యాడ్ ప్రసారాన్ని నిలిపివేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.